ఉదయనిధి అఫిడవిట్‌లో లెక్కల తారుమారు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!
- 2021, 2026 ఎన్నికల అఫిడవిట్ల మధ్య తేడాలు ఉన్నాయని హైకోర్టుకు తెలిపిన ఐటీ శాఖ
- బ్యాంకు రుణాల విషయంలో కూడా తేడాలను గుర్తించిన అధికారులు
- ఐటీఆర్-2 కింద మళ్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచన
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలోని గణాంకాలపై ఆదాయ పన్ను శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2021 అఫిడవిట్ కు, 2026 ఎన్నికల అఫిడవిట్ కు మధ్య తేడాలు ఉన్నాయని మద్రాస్ హైకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది.
2021 అఫిడవిట్‌లో రెడ్ జెయింట్ మూవీస్‌లో రూ. 7.36 కోట్ల పెట్టుబడి ఉన్నట్లు చూపిన ఉదయనిధి, 2026 అఫిడవిట్‌లో ఆ ప్రస్తావనే చేయలేదు. అదే సంస్థలో ఆయన భార్య పేరిట రూ. 2.63 కోట్ల పెట్టుబడులు ఉన్నట్టు ప్రస్తుత అఫిడవిట్లో చూపించారని... ఈ పెట్టుబడులను 2021 అఫిడవిట్లో ప్రస్తావించలేదని ఐటీ శాఖ పేర్కొంది.
2021లో రూ. 11.06 కోట్లు, 2026లో రూ. 10 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. కానీ కంపెనీ రికార్డుల ప్రకారం అది రూ. 18 కోట్లుగా ఉందని ఐటీ శాఖ వెల్లడించింది. తాజా అఫిడవిట్ ప్రకారం ఉదయనిధి ఆస్తుల విలువ రూ. 20.6 కోట్లు (రూ. 12.9 కోట్ల చరాస్తులు, రూ. 7.7 కోట్ల స్థిరాస్తులు). అయితే ఈ గణాంకాలన్నీ గందరగోళంగా ఉన్నాయని, ఐటీఆర్-2 ఫార్మాట్ కింద మళ్లీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని ఐటీ శాఖ సూచించింది.
చెన్నై నివాసి ఆర్. కుమారవేల్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. ఉదయనిధి 2024-25 వార్షిక ఆదాయం రూ. 10 లక్షలుగా చూపగా, ఆయన భార్య ఆదాయం రూ. 2.9 కోట్లుగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది.